విష్ణుదూతలు, యమదూతలకు మధ్య సంవాదం కొంతమేర తెలుసుకున్నాం. యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను మీ లోకానికి తీసుకురమ్మని చెబుతాడని ప్రశ్నించడం.. దానికి యమదూతలు సమాధానం ఇవ్వడం తెలుసుకున్నాం కదా. ఆ తరువాత విష్ణు దూతలకు యమ దూతలు మరికొంత క్లారిటీ ఇవ్వడానికి యత్నించారు. వాస్తవముగా పాపులెటువంటి వారో, ఏయే పాపములు చేసినవారు పాపులగుదురో వినమంటూ నరక దూతలు విష్ణు దూతలకు చెప్పారు. సదాచారములన్నింటినీ విడిచి పెట్టి వేదశాస్త్రములు నిందించువాడు పాపాత్ములవుతారని యమ భటులు తెలిపారు.
అలాగే గోహత్య, బ్రహ్మహత్యాది మహా పాపములు చేసినవారు, పరస్త్రీలను కామించేవారు, తల్లిదండ్రులను, గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు కూడా మహా పాపులవుతారని తెలిపారు. జారత్వము, చోరత్వంతో భ్రష్టులైనవారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని కూడా వదలకుండా బాధించువారు కూడా పాపములు చేసిన వారేనని తెలిపారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగనీయకుండా అడ్డుతగిలే వారును పాపాత్ముల కోవలోకి వస్తారు. అటువంటి పాపాత్ములు మరణించగానే యమలోకమునకు తీసుకొస్తామని వెల్లడించారు. వారిని నరకములో వేసి శిక్షించవలసిందిగా యమ ధర్మరాజు తమను ఆజ్ఞాపించారని యమ భటులు వెల్లడించారు.