
తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ పండుగ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి పండుగ రానే వచ్చింది. నిన్న (ఆదివారం) పెత్తరామాస మాత్రమే కాకుండా ఎంగిలిపూల బతుకమ్మను అత్యంత వైభవంగా మహిళలు నిర్వహించుకున్నారు. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది పువ్వులే కదా.. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. తంగేడు, గునుగు, సీతమ్మవారి పువ్వులు లేకుండా బతుకమ్మను అయితే పేర్చడం జరగదు.
ఇక వీటిలో అత్యంత ముఖ్యమైన గునుగు పువ్వు. ఈ పువ్వు బతుకమ్మకు మరింత అందాన్నిస్తుంది. గునుగు పువ్వులో ఎన్నో ఔషధ గుణాలుండటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గాయాలున్న చోట పూస్తే ఎంత పెద్ద గాయమైనా మానిపోతుందని చెబుతారు. ముఖ్యంగా కందిరీగలు కుట్టినప్పుడు ఈ ఆకు రసం రాస్తే మంట త్వరగా తగ్గిపోవడంతో పాటు గాయం కూడా మాయమవుతుందట. క్షయ వ్యాధి నివారణకు సైతం గునుగు ఆకుల రసంతో తగ్గిస్తారట. గునుగు పువ్వుల గింజలు యూరినరీ ఇన్ఫెక్షన్ను తగ్గించడమే కాకుండా రక్తస్రావం, అతిసారం వంటి సమస్యలు తగ్గుతాయట.
