
పురాణాలలో పధ్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. భూమికి దిగువన ఉండేవి ఏడు లోకాలు కాగా.. భూమి నుంచి పైన ఉండేవి ఏడు. భూమి లోపల ఉండే లోకాల గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు భూమి నుంచి పైన ఉండే లోకాల గురించి తెలుసుకుందాం. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం. భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు. అవి భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. వీటిలో మొదటి మూడు లోకాల గురించి ముందుగా తెలుసుకుందాం.
భూలోకం: ఈ లోకంలో స్వేదజాలు (చెమట నుండి ఉద్భవించు పేనులు, నల్లులు మొదలైనవి), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు, పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు నివసిస్తాయి.
భువర్లోకము (భూలోకము పైన): ఈ లోకంలో సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు ఉంటారు.
సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము: ఇది భువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ అధిష్ఠాన దేవతలగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు ఉంటారు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వీరు కామరూపులై భోగాలను అనుభస్తారు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.
