ఏదైనా పని.. లేదంటే ఏదైనా శుభకార్యం.. అదీ కాదంటే ఏదైనా పూజ ఏం చేసినా తొలి తాంబూలం విఘ్నరాజైన వినాయకుడికే ఇవ్వాలి. తొలి పూజ ఆయనకే నిర్వహించాలి. లేదంటే చేసే పనిలో విఘ్నాలు తలెత్తుతాయని చెబుతారు. గణపతి అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టతరమైన పని అయినా చక్కగా సునాయాసంగా పూర్తవుతుందట. అలాంటి గణపతి లేని ఊరంటూ ఉంటుందా? అస్సలు ఉండదు. అయితే ఆయన ఆలయాల్లో కొన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అలాంటి వాటిలో తమిళనాడులోని గణపతి ఆలయం కూడా ఒకటి. దానికి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం.

తమిళనాడులోని కుంభకోణం బస్టాండ్ నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఈ గణపతి ఆలయం ఉంటుంది. ఇక్కడి గణపతిని శ్రీ నురుగు గణపతిగా పిలుస్తారు. ప్రపంచంలోనే ఇక్కడి వినాయకుడిని పోలిన విగ్రహం మరొకటి లేదట. ఇక్కడి విగ్రహం ప్రత్యేకత ఏంటంటే.. పాల సముద్రపు నురుగుతో రూపొందిందని చెబుతారు. అందుకే ఈ గణపతిని శ్రీ నురుగు గణపతిగానూ.. శ్వేత వినాయకర్‌గా పిలుస్తారు. ఈ ఆలయాన్ని సంస్కృతంలో శ్వేత వినాయక దేవాలయం లేదా తమిళంలో వెల్లై వినాయక దేవాలయమని పిలుస్తారు. అంటే తెల్లని వినాయకుడి దేవాలయమని అర్థం.
