శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడి గురించి మనకు తెలిసిందే. ఆయన ఆలయాలు కూడా మన దేశంలో కొన్ని చోట్ల ఉన్నాయి. మరి కాలభైరవుడి జన్మదినం ఎప్పుడో తెలుసా? కాల భైరవుడి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథిన జరుపుకుంటాం. అసలు ఈ ఏడాది కాలబైరవుడి జన్మదినం ఎప్పుడు రానుంది? అది మరెప్పుడో కాదు.. ఇవాళే. ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వ్యక్తి కష్టాల నుంచి మాత్రమే కాకుండా.. అకాల మరణ భయం నుంచి కూడా బయటపడతాడట. శివ పురాణంలోని శ్రీ శత్రుద్ర సంహిత ఎనిమిదవ అధ్యాయంలో కాల భైరవుని జననం గురించి వివరించారు.
కాలభైరవుడి జన్మ వృత్తాంతం ఏంటంటే.. బ్రహ్మ, విష్ణువు మధ్య ఓ విషయమై వివాదం జరుగుతుండగా వారి మధ్య నుంచి ఒక పెద్ద కాంతి కనిపించింది. శివుడు ఆది అంతం లేని అగ్ని స్తంభం రూపంలో వారిద్దరికీ దర్శనమిచ్చాడట. అప్పుడు వారికి ఈ స్తంభం ఆది అంతాలను కనుక్కోమని చెప్పగా వారిద్దరూ కనుక్కోలేకపోయారట. బ్రహ్మ దేవుడు ఐదవ ముఖం శివుడిని తూలనాడుతుండటంతో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఆవిర్భవించిన భయంకర రూపమే కాలభైరవుడని చెబుతారు. ఆ కాలభైరవుడు శివుడిని దూషించిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సుని ఖండించాడు. అప్పుడు బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయిందని చెబుతారు.