శ్రీకృష్ణుడి జన్మ స్థలమైన మధురలో కొలువైన నారీ సెమ్రీ దేవి ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ అమ్మవారు కర్రలతో వస్తేనే అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. కర్రలతో వస్తే అమ్మవారు సంతోషించి మన జీవితంలో కష్టాలన్నింటినీ పోగొడుతుందట. ఇది ఈనాటి సంప్రదాయం కాదు.. 750 ఏళ్లుగా భక్తులు అనుసరిస్తున్నారు. ఒకసారి ఈ ఆలయంలోని విగ్రహం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయట. ఆ సమయంలో పెద్ద ఎత్తున కర్రలతో కొట్లాట జరిగిందట. ఆ కొట్లాటే ఇప్పటికీ కొనసాగుతోందని చెబుతారు.
సిసోడియా, యధువంశీ ఠాకూర్ కుటుంబాల మధ్య విగ్రహం విషయంలో కర్రలతో పోరాటాలు జరిగాయట. ఈ పోరాటంలో యధువంశీ ఠాకూర్లు విజయం సాధించారు. అప్పటి నుంచి భక్తులంతా ఇక్కడకి కర్రలతో వచ్చి పూజా సమయంలో వాటితో ఆలయ గోడలు, నేల, గంటలపై కర్రలతో కొడుత ఉంటారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం శ్రీరామనవమి రోజు మినహా ఏడాదంతా వంకరగా ఉంటుందట. నవమి రోజున మాత్రం నిటారుగా మారుతుందట. ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. అంతేకాకుండా దుర్గాదేవి పందాలను సైతం నిర్వహిస్తూ ఉంటారు.