‘జరామరణమోక్షాయ’ శ్లోక సారాంశం ఏంటంటే..

”జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ॥29॥

“ఎవరైతే వార్ధక్యము, మరణముల నుంచి విముక్తి కొరకు నన్ను ఆశ్రయిస్తారో, వారు సకలము ఆ పరబ్రహ్మ స్వరూపము, సకల కర్మలస్వరూపము, ఆ పరబ్రహ్మ అని తెలుసుకుంటారు.”

మాతృగర్భం నుంచి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే జీవితం. ఇది అన్ని జీవులకూ ఒకటే. తేడా లేదు. దీనిలో ఆయా జీవుల ఆయుఃప్రమాణమును బట్టి ముసలితనము, మరణము సంభవిస్తుంటాయి. మరలా జన్మ. మరలా ముసలి తనము మరణము. ఇదే జనన మరణ చక్రము. దీని నుండి విడివడడమే మోక్షము. ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయిస్తే వస్తుంది. ఆ పరమాత్మ ఎవరు. సర్వశక్తి మంతుడు, సర్వవ్యాపి, బ్రహ్మము. దానికి మార్గము ఆధ్యాత్మిక సాధనలు.

వారు చేసే ఆధ్యాత్మికసాధనలు అన్నీ ఆ బ్రహ్మమే. అంటే అర్ధం ఈ ప్రపంచం అంతా బ్రహ్మ మయం. ఇటువంటి అనుభూతి అందరికీ కలుగుతుందా! అంటే కలుగుతుంది. కాకపోతే దానికి కావలసిన సాధన, అభ్యాసము, ధ్యానము చేయాలి. అప్పుడు సాధకుడికి బ్రహ్మకు తేడా ఉండదు. తానే బ్రహ్మ అయిపోతాడు. అదే అహంబ్రహ్మాస్మి అనే తత్వము. ఇదంతా ప్రయత్నం వలన సిద్ధించాల్సిందే కానీ ఏ దేవుడూ ఇచ్చేది కాదు, ఎవరూ పుచ్చుకునేదికాదు. కేవలము భగవంతుని ఆశ్రయించడం వలననే సిద్ధిస్తుంది.

Share this post with your friends