
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇప్పటికే మనం శ్రీకృష్ణుడు, కుచేలుని కథ తెలుసుకున్నాం కదా. మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన మరో ఇద్దరు మిత్రులు ఉన్నారు. అదే దుర్యోధనుడు, కర్ణుల స్నేహం. దుర్యోధనుడు ఎంతటి దుర్గార్ముడైనా కూడా స్నేహం విషయంలో అత్యంత నిజాయితీగా.. గొప్ప మిత్రుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. కుంతీ పుత్రుడైన కర్ణుడు ఎన్నో అవమానాలకు గురైన మీదట తన ధనుర్విద్యా ప్రావీణ్యంతో దుర్యోధనుడి కంట పడి.. కౌరవ పక్షాన చేరాడు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కర్ణుడు తను కుంతీదేవీ కుమారుడేనని.. తన జన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు. పాండవ పక్షం వహిస్తే రాజుగా పట్టాభిషేకం జరిగేలా చూస్తానని కుంతీదేవి కర్ణుడికి చెబుతుంది. కానీ కర్ణుడు మిత్రధర్మం పాటించి తల్లి మాటను కాదని దుర్యోధనుడి వైపే నిలిచాడు.
కురుక్షేత్ర సంగ్రామం భీకర రూపం దాల్చిన సమయంలో దుర్యోధనుని బలం కర్ణుడే అని తెలిసిన శ్రీకృష్ణుడు.. ఒకరోజు రాత్రి అతని వద్దకు వెళ్లాడు. కర్ణుడిని పిలిచి అతని జన్మ వృత్తాంతం చెప్పి.. పాండవుల పక్షంలోకి ఆహ్వానించాడు. కానీ కర్ణుడు మాత్రం తానెవరన్నది తనకు తెలుసని.. శ్రీకృష్ణుడు ధర్మం పక్షాన నిలిచారు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపు పాండవులదేనని అన్నాడు. అధర్మవర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరని.. ఆ విషయం తనకు తెలుసని తెలిపాడు. ఓడిపోయే వారి పక్షాన ఎందుకని కృష్ణుడు ప్రశ్నించగా.. తనను నమ్ముకుని యుద్ధానికి సిద్ధపడిన దుర్యోధనుడిని ఒంటరిని చేయలేనని.. అది మిత్ర ద్రోహమని చెప్పాడు. అలా స్నేహానికి నిజమైన నిదర్శనంగా కర్ణుడు నిలిచాడు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసినా కూడా ఎన్నడూ కర్ణుడు స్నేహ ధర్మాన్ని వీడలేదు. కురుక్షేత్ర సంగ్రామంలో అతని వైపే నిలిచి మరణించాడు. మరి దుర్యోధనుడు ఏమైనా తక్కువ తిన్నాడా? స్నేహంలో అతను కూడా ఆదర్శప్రాయుడే. కురుక్షేత్ర యుద్ధంలో తన వారంతా మరణించినా కూడా ఏమాత్రం చలించని దుర్యోధనుడు కర్ణుని మరణంతో మాత్రం చాలా విరక్తి చెందాడు.
