పిట్ట బాధను విష్ణుమూర్తికి చెప్పిన నారదుడు.. అప్పుడేం జరిగిందంటే..

ఒక ఎడారిలో చిన్న పిట్ట నివసించేది. పచ్చదనం లేక, మండే ఇసుకలో గెంతుతూ రోజులు గడిపేది. ఒక రోజు నారదుడు అటుగా వెళ్తూ పిట్ట కష్టాలు చూసి జాలి పడి “ఓ చిన్ని పిట్టా! ఇంత ఎండలో ఏమి చేస్తున్నావు? నీకు సహాయం కావాలా?” అని అడిగాడు. అప్పుడు పిట్ట.. ‘‘జీవితం ఆనందంగా ఉంది. కానీ వేడిని భరించలేక, నా కాళ్లు మండిపోతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే హాయిగా జీవించగలిగేదాన్ని” అని తెలిపింది. నారదుడు విష్ణుమూర్తి దగ్గరకి వెళ్లి వినతిని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి: “అక్కడ చెట్టు పెరగడం విధిరాతలో లేదు. నేను మార్చలేను. కానీ ఉపశమనానికి ఒక మార్గం చెబుతాను. ఎప్పుడూ ఒక కాలి మీదే నిలబడి, మరొక కాలుకు విశ్రాంతి ఇవ్వమని చెప్పు” అన్నాడు.

నారదుడు తిరిగి వచ్చి పిట్టకు భగవంతుని సందేశం చెప్పాడు. పిట్ట ఆనందంతో కృతజ్ఞతలు తెలిపింది. నారదుడు ఆశ్చర్యపోయాడు: “ఇందులో ఇంత సంతోషమా? చెట్టు రాలేదు కదా!” పిట్ట మాత్రం భక్తితో ఆచరించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచాయి… మళ్ళీ నారదుడు వచ్చి చూశాడు.

ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు.. అదే చెట్టుపై హాయిగా కూర్చున్న పిట్ట. ఆశ్చర్యంతో మళ్ళీ పరమాత్మను అడిగాడు. విష్ణుమూర్తి చిరునవ్వుతో: “నారదా! నేను చెప్పినట్లే జరిగింది. విధిలో చెట్టు రాయలేదు. కానీ పిట్ట భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతతో నా ప్రసాదాన్ని స్వీకరించింది. ఆ పవిత్ర హృదయానికి నా అనుగ్రహం కలసి అసంభవాన్ని సంభవం చేసింది” అన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే.. అందినదాన్ని ప్రసాదముగా భావించాలి. కృతజ్ఞతతో స్వీకరించి ఆచరించాలి. కావలసింది ఏమిటో ఆయనే ఇస్తారు. భక్తి, శ్రద్ధ, విశ్వాసం, కృతజ్ఞత వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.

Share this post with your friends