
సొంత అన్నదమ్ములైనా సరే.. ఏదో ఒక సమయంలో మనస్పర్ధలు రావొచ్చు. అలా రాకుండా ఉండేందుకు ఎలా ప్రవర్తించాలో చెప్పే కథ మహాభారతంలో ఒకటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు రాజ్యమేలుతుండగా ఒకసారి అక్కడికి నారదుడు వచ్చాడు. ఆయనకు ధర్మరాజు అతిథి పూజలను అందుకున్నాడు. ద్రౌపది లేని సమయంలో పాండవులకి నారదుడు ఒక కత వినిపించాడు. పూర్వం నికుంభుడనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందడనే కుమారులు జన్మించారు. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. అయితే వారు బ్రహ్మ గురించి వింద్య పర్వతాల్లో కఠోర తపస్సు చేశారు. సుందుడు, ఉపసుందుడి తపోదీక్షకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై కాపరూపం, కామగమనం, అమరత్వం, సకలమాయలు వంటి వరాలను కోరుకున్నారు.
అమరత్వం ఇవ్వడం కుదరదని చతుర్ముఖుడు చెప్పడంతో వారిద్దరూ ఇతరులెవ్వరి కారణంగా చావు రాకూడదని కోరుకున్నారు. బ్రహ్మ ఇచ్చిన శక్తులతో ఇద్దరూ పులులు, ఏనుగుల రూపాలు ధరించి మునుల ఆశ్రమాలపై దాడి తలపెట్టారు. దీంతో బుుషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకోవడంతో బ్రహ్మ ఒక ప్రణాళికను రచించాడు. ఇతరులెవరి కారణంగా మరణం లేకపోవడంతో విశ్వకర్మను బ్రహ్మ పిలిపించి సృష్టిలో కెల్లా అత్యంత సౌందర్య రాశి అయిన కన్యను సృషించమని చెప్పాడు. దీంతో అత్యంత సౌందర్యరాశికి విశ్వకర్మ జీవం పోశాడు. ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి కార్యాన్ని బోధించాడు.
సుందోపసుందుల దగ్గరికెళ్లి తిలోత్తమ వయ్యారాలను ఒలకబోసింది. ఇద్దరూ తిలోత్తమ కోసం పోటీ పడ్డారు. వారిలో ఎవరు బలవంతుడైతే తాను వారి సొంతమవుతానని చెప్పడంతో ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. మొత్తానికి భీకరమైన పోరులో ఇద్దరూ మరణించారు. ఈ కథను వివరించిన నారదుడు స్త్రీ విషయంలో తగవులు రావొచ్చని.. ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించ వద్దని హితవు పలికారు. అది విన్న ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపదితో ఒక్కొక్కరూ ఒక సంవత్సరం భర్తగా ఉండేలా ఆ సమయంలో వేరెవరైనా ఈ కట్టుబాటు దాటితే ఒక సంవత్సరం తీర్ధయాత్రలకు వెళ్ళి వచ్చేలా ఏర్పాటు చేశాడు.
