
కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అంతర్వేది విరాజిల్లుతోంది. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ గోదావరి మూడు పాయల్లో ఒకటైన వశిష్ట అంతర్వేది వద్దనే బంగళాఖాతంలో కలుస్తుంది. త్రికోణాకారపు దీవిలో అంతర్వేది ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువుదీరి అంతర్వేదికి మరింత ప్రాధాన్యతను చేకూర్చారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. పురాణాలలో సైతం ఈ ఆలయ ప్రస్థావన ఉందని చెబుతారు. లక్ష్మీ సమేతుడై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.
కాశీకి వెళ్లలేని వారు ఒక్కసారి అంతర్వేదిని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యమట. అందుకే అంతర్వేది దక్షిణ కాశిగా ప్రసిద్ధికెక్కింది. అంతర్వేదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందం. పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు రుద్రయాగం చేయాలని సంకల్పించాడట. శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుంచి విముక్తి కోసం ఈ యాగం తలపెట్టాడట. అయితే రుద్రయాగం నిర్వహించేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దానిని ‘వేదిక’లా మలచాడట. అలా అంతర్వేదికి ఆ పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
