ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో సీతా సమేతుడై రాములవారు సందర్శించారట..

అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పురాణ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. రక్తావలోచనుని నరసింహ స్వామి సంహరించిన రక్తకుల్య నదిలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య నదిలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని సందర్శించాడట. ఆ సమయంలోనే లక్ష్మీ నరసింహ మూర్తిని దర్శించి, సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అనంతరం అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాల వల్ల తెలుస్తోంది.

ద్వాపర యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ని దర్శించాడట. ఈ విషయాన్ని చేమకూర వేంకట కవి తన ‘విజయ విలాసము’, శ్రీనాథ కవి సార్వభౌముడు ‘హరివిలాసం’లోనూ వివరించారు. అంతర్వేదిలోని ప్రస్తుత ఆలయాన్ని క్రీ.శ. 300 ఏళ్లకు పూర్వం నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాన్ని మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండగా.. ప్రస్తుతం మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది. ఈ ఆలయం సముద్రంలో నది కలిసే ప్రాంతంలో ఉన్న కారణంగా దీనిని ద్వీప దేవాలయంగా కూడా పిలుస్తారు. అంతర్వేది ఆలయంలోని గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పశ్చిమాభి ముఖంగా వెలసి ఉండడం విశేషం.

Share this post with your friends