
హనుమంతుడిని పూజించని హిందువు అంటూ ఉండటం అనేది చాలా అరుదు. శ్రీరాముడి బంటుగా హిందువులందరి హృదయంలో కొలువైన దేవుడు ఆయన. శక్తి, బలం కోసం అంతా హనుమంతుడిని పూజించుకుంటారు. తనను పూజించే కన్నా శ్రీరాముడిని పూజస్తే ఆనందపరవశుడవుతాడు. శ్రీరాముడి భక్తులైతే చాలు.. హనుమంతుడి అనుగ్రహం వారికి ఉన్నట్టే. అసలు ఆంజనేయుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? రామభక్తుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి నియమాలు పాటించాలి? తెలుసుకుందాం.
సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుపోయినప్పుడు.. సీతాన్వేషణలో భాగంగా శ్రీరాముడు కిష్కింధకు వెళతాడు. అక్కడ రాముడికి సుగ్రీవుడి మంత్రిగా హనుమ తొలిసారి పరిచయం అవుతాడు. ఆనాటి నుంచి శ్రీరాముడిని కడదాకా హనుమంతుడు విడిచి పెట్టలేదు. శ్రీరాముడికి నమ్మినబంటుగా, భక్తుడిగా సేవించిన హనుమను రాముడు చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు. అందుకే ఏ ఆలయంలోనైనా శ్రీ రాముడితో కలిపి హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. మనం కూడా శ్రీరాముడితో కలిపి హనుమంతుడిని సేవించుకుంటేనే ఫలితం మరింత బాగుంటుందట.
