విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. అగస్త్య మహామునికి హయగ్రీవ స్వామి ఈ లలితా సహస్ర నామ రహస్యాలను ఉపదేశించాడని చెబుతారు. ఆ పవిత్ర స్థలమే తిరుమీయాచ్చూర్ లలితాంబికా క్షేత్రమని చెబుతారు. ‘యావత్ విశ్వంలో లలితా సహస్రనామాలు పఠించడానికి అనువైన స్థలం ఏదని హయగ్రీవ స్వామిని అగస్త్యుడు ఒకసారి అడిగాడట. అప్పుడు హయగ్రీవుడు తిరుమీయచూర్’ అని సమాధానం ఇచ్చాడట. దీంతో అగస్త్య మహాముని తన ధర్మపత్ని లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకున్నాడట.

తన సతీమణితో కలిసి అగస్యుడు లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలు జపించాడని చెబతారు. వారిద్దరూ తన సహస్ర నామాలను పఠించడంతో లలితాంబికా అమ్మవారు ప్రీతి చెందిందట. అప్పుడు వారి ఎదుట లలితాంబిక నవరత్నాలు పొదిగిన హారం ధరించి ప్రత్యక్షమైనట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ క్షేత్రంలో లలితా సహస్రనామావళి పఠిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే ఈ పవిత్ర క్షేత్రంలో గరుత్మంతుడు తన తల్లి దాస్యం పోగొట్టేందుకు పూజలు నిర్వహించాడట. వాలి, సుగ్రీవుడు, యమధర్మరాజు, శనీశ్వరుడు సైతం ఇక్కడి లలితాంబికను దర్శించుకుని పూజలు నిర్వహించారట.
