
సాలగ్రామాల గురించి ఇప్పటికే ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. సాలగ్రామాల పౌరాణిక కథేంటో కూడా తెలుసుకున్నాం. సాలగ్రామాలలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇంట్లో పూజించే సమయంలో మాత్రం లక్ష్మీనారాయణ సాలగ్రామం, విష్ణు, సీతారామ, గోపాల సాలగ్రామ వంటి శాంతమూర్తులను మాత్రమే పూజించాలట. వివాహం కాని వారు అయితే లక్ష్మీనారాయణ, విష్ణు సాలగ్రామాన్ని పూజిస్తే మంచిదట. అసలు సాలగ్రామాన్ని ఎలా పూజించాలంటారా? ముందుగా ఆవు పాలతో కానీ.. పంచామృతంతో కానీ శుద్ధి చేసిన మీదట పూజను ప్రారంభించాలి. ఇంట్లో సాలగ్రామం ఉంటే మాత్రం నిత్యం తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి.
ఆ ఇంటి కుటుంబసభ్యులు మినహా ఇతరులెవరూ సాలగ్రామాన్ని దర్శించకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక భద్రమైన ప్రదేశంలో పెట్టాలి. అలాగే సాలగ్రామాన్ని స్త్రీలు తాకకూడదని చెబుతారు. కాబట్టి ఇంటి యజమాని మాత్రమే సాలగ్రామానికి పూజ చేయాల్సి ఉంటుంది. సాలగ్రామాన్ని నిత్యం పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే సాలగ్రామాన్ని దానం చేస్తే.. పూజించడానికి మించిన ఫలితం లభిస్తుందట. ఆ ఫలితం ఎలా ఉంటుందంటే.. కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం, కోటి గోవులను దానం చేసిన ఫలం, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగా నదీ స్నానం చేసిన దానికంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుందట.
