
లక్ష్మీదేవికి సంబంధించి ఇప్పటికే ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. ఇవాళ డబ్బు, బంగారం, భూమి, ఇల్లు, మహిళ, పదవి, హోదా, నాయకత్వం, ఆధిపత్యం వంటి అశాశ్వతమైన వాటి కోసం మనిషి ఎంతటి నైచ్యానికైనా వెనకాడటంలేదు. వీటి కోసం అత్యాచారాలు, ఆక్రమణలు, హత్యలు, వేధింపులు- ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగేచోట లక్ష్మి స్థిరంగా నివసించదు. అటువంటి ప్రదేశాల్లో లక్ష్మి అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర్య(మహాత్మ్యాన్ని) ప్రభావం చూపిస్తూ ఉంటుందంటారు.
లక్ష్మి చాపల్యం గలది..!
చంచల మనస్కురాలని అంటూ ఉంటారు..!
ఇది భ్రమ..!
విద్య, ధాన్యం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీలక్ష్మీ అష్ట స్వరూపాలే..! ఇవన్నీ లభించాలంటే.. ఇంట్లోనివారు నియమ నిష్ఠలు.. పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత, పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ,
ఇవి లక్ష్మీకృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు.
జ్ఞాన ధ్యానాసక్తి, సాధుసేవ, మిత భోజనం, మితనిద్ర, ఆస్తికత, తులసి పూజ, వృక్ష పోషణ.. ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణాలు నిరంతరం పరివ్యాప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. తామరపూలు, కొలనులు, వృక్షాలు, ఫలపుష్పాలు, పుణ్యక్షేత్రాల్లో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం.
