అన్నమయ్య ఉత్తముల లక్షణాలను ఏమని వివరించాడంటే..

చాలామందికి కాలక్షేపం – ‘పరనింద’. ఒక ఇద్దరు కలిస్తే ఎవరో మూడో వ్యక్తి దోషాలను చర్చిస్తూ వినోదిస్తుంటారు. ఆ మూడో వ్యక్తి మనకి బాగా పరిచయస్తుడు కానక్కర్లేదు. లోకంలో ప్రసిద్ధుడు కావచ్చు… మరెవరైనా కావచ్చు. మనకి ఉన్న అమూల్య సమయంలో ప్రధాన భాగం అన్యుల తప్పులను విశ్లేషించడంలోనే ఖర్చవుతోంది. పరమ సాధ్వీలతామ సీతాదేవి నిష్కల్మ చరిత్ర కూడా దానికి మినహాయింపు కాదు. ఆ తల్లిని కూడా తూలనాడుతూ, ధర్మవిగ్రహుడైన శ్రీ రామచంద్ర ప్రభువును సైతం తప్పుపట్టిన నిందాతత్పరులు నాటి త్రేతాయుగంలో అయోధ్యలోనే ఉన్నారంటే ఆశ్చర్యమౌతుంది. నిందకీ, ద్వేషానికీ దేశ, కుల మత భేదాలు లేవేమో అనిపిస్తుంది.

‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అని వేమన వేదనపడ్డా, ‘ఉర్విజనులకెల్ల ఉండుతప్పు’ అన్నది ఎంత వాస్తవమో, ‘తప్పులెన్ను వారు తప్పక ఉందురు’ అన్నది కూడా యధార్థమే. కార్యాలయాలలో, సమావేశాలలో ఎవరో ఒకరి జీవిత సంఘటనల్ని తీసుకువచ్చి వాటిని విశ్లేషిస్తూ కాలయాపన చేసే వారి సంఖ్య తక్కువ కాదు. మన శాస్త్రాలలో – ఇతరుల దోషాలను చర్చించే నిందా కార్యక్రమాల వల్ల ఫలితాలెలా ఉంటాయో గొప్పగా వర్ణించబడింది. ప్రతివ్యక్తికీ పాపపుణ్యాలుంటాయి. వారిని కీర్తించేవారు పుణ్యాన్నీ, నిందించే వారు పాపాన్నీ పంచుకుంటారు. పుణ్యాల ఫలం సుఖం, పాపాల ఫలం దుఃఖం – అని మరచిపోరాదు.

 

అన్నమయ్య ఉత్తముల లక్షణాలను ఏమని వివరించాడంటే..

 

“పరనింద సేయ తత్పరుడు కానివాడు
అరుదైన భూతదయానిధి యగువాడు
పరులు తామేయని భావించువాడు
ఏ కులజుడేమి ఎవ్వదైన నేమి?
ఆకడ నాతదే హరినెరిగిన వాడు…” –

అని అన్నమయ్య ఉత్తముల లక్షణాలను వివరించాడు…. ఈ కోవకి చెందినవారం కావాలి – అని భావించి ప్రయత్నించినప్పుడు ధన్యులమౌతాం.

Share this post with your friends