ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేర్కొనే మహాకుంభమేళా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్‌లో యోగి కేబినెట్ తాజాగా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో త్రేతా యుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అంతటి పవిత్ర ప్రదేశమైన చిత్రకూట్‌తో పాటు ప్రయాగ్‌రాజ్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అలాగే గంగానదిపై ఆరు లేన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాలన్నింటిని అభివృద్ది చేయడం, గంగా ఎక్స్‌ప్రెస్ వే దాని మౌలిక సదుపాయాల విస్తరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రయాగ్‌రాజ్ నుంచి మీర్జాపూర్ మీదుగా భాదోహికి కాశీ, చందౌలీ మీదుగా కలుపుతుంది. అలాగే ఘాజీపూర్ వద్ద పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి.. వారణాసి – చందౌలీ నుంచి ఈ గంగా ఎక్స్‌ప్రెస్ వే సోన్‌భద్రను జాతీయ రహదారికి కలుపుతుంది. అలాగే గత వారం రోజుల్లో 9.25 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో స్నానమాచరించినట్టు యోగి తెలిపారు. ఈ క్రమంలోనే తన మంత్రులతో కలిసి ఆయన కూడా మహాకుంభానికి వెళ్లి సంగం బ్యాంకుల్లో పుణ్యస్నానమాచరించారు.