వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

స్వయంభువు అయిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారితో పాటు ఆలయాన్ని దివ్య మనోహరంగా అలంకరించారు. ప్రధానాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా స్వామివారిని అధిష్టింపజేశారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో అందంగా అలంకరించారు. ముందుగా ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ విష్ణు గణాలకు అధిపతి అయిన విశ్వక్సేనుడిని పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఆలయ అర్చకులు, వేదపండితులు, రుత్వికుల ఆరాధించారు.

అనంతరం ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తివాచనం కార్యక్రమాన్ని ప్రధానార్చక బృందం నిర్వహించింది. అలాగే రక్షాబంధనం, వేద మంత్రోచ్చారణ, చతుర్వేద, ప్రబంధ పారాయణాల నడుము సంప్రోక్షణ, పుణ్యాహ వాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు సైతం రక్షా బంధనాలను ధరింపజేశారు. మార్చి 8వ తేదీన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు. ప్రధానాలయం ముఖ మండపంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, అష్టదిగ్పాలక బలిహరణ కార్యక్రమాలు చేపట్టారు.

Share this post with your friends