
కొన్ని ప్రదేశాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి. దసరా నాడు రావణ దహనం గావిస్తారు. ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకునే ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో దసరా పండుగను అత్యంత వైభవంగానూ.. విభిన్నంగానూ జరుపుకుంటారు. ఇక్కడ రావణ దహనం వంటివి చేయరు. దసరా రోజున దేవతలు ఒకరినొకరు కలిసేందుకు ఇక్కడకు వస్తారని స్థానికుల నమ్మకం. ఇది ఇప్పుడు కాదు.. 375 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.
కులులోని దసరా వేడుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. కులు లోయలో దసరా వేడుక నాడు ఇక్కడ దేవతలంతా సమావేశమవుతారని స్థానికులు చెబుతారు. అందుకే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ వేడుక ప్రత్యేక సంప్రదాయంతో, ఆధ్యాత్మిక పరంగానూ ప్రసిద్ధిగాంచింది. కులులో దసరా పండుగను దేశంలో అందరి మాదిరిగా కాకుండా అక్టోబర్ 2 నుంచి జరుపుకుంటారు. ఈ వేడుక అక్టోబర్ 8 వరకూ నిర్వహించుకుంటారు. వారమంతా సంగీత వాయిద్యాల నడుమ జానపద నృత్యాలు నిర్వహిస్తూ సందడిగా గడుపుతారు.
