
డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం కల్పించినట్టుగా వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పది రోజుల్లో స్వామివారిని 7.83 లక్షల మంది దర్శించుకున్నారు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శనాలు అయ్యాయి. జనవరి 2వ తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం కల్పించినట్టు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
