ఈ ఏడాది నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వాటిలో రెండు గ్రహణాలు ఇప్పటికే సంభవించిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చంద్రగ్రహణం కాగా.. మరొకటి సూర్యగ్రహణం. ఇవి రెండూ గత నెలలోనే సంభవించాయి. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. ఇక ఈ ఏడాది మరో రెండు గ్రహణాలే సంభవించనున్నాయి. మరి అవైనా ఈ ఏడాది కనిపిస్తాయో లేదనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగా తెలుసుకుందాం.
ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న అమావాస్య రోజున ఏర్పడనుంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు ఏర్పడుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:24 గంటల వరకు ఉంటుంది. మొత్తంగా ఈ సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 24 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం కూడా భారత్‌లో కనిపించే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది. కాబట్టి భారతీయులకు సూతకాలం అంటూ ఏమీ ఉండదు.