
జగన్మాతకు ఒక రూపం కాదు.. ఒక పేరు కాదు.. ఎన్నో రూపాలు.. మరెన్నో పేర్లు… నిత్యం అమ్మవారు తన భక్తులను ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తూనే ఉంటుంది. నవదుర్గలుగా మాత్రమే కాకుండా.. అటు గ్రామ దేవతలుగా కూడా అమ్మవారు తన లీలలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఆశ్వయుజ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది దేవీ శరన్నవరాత్రులు. ఈ మాసం ఆరంభంలోనే ఈ పండుగ ఉంటుంది. ఇక దసరా పండుగ పూర్తయిన వెంటనే ఏపీలోని విజయనగరంలో సిరిమానోత్సవం ఉంటుంది. ఈ ఏడాది పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడు?
ఈ సంబరాలకు ఏర్పాట్లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? వంటి విషయాలను తెలుసుకుందాం. పైడితల్లి సిరిమాను ఉత్సవం అనేది ఉత్తరాంధ్రలో జరిగే అతి పెద్ద జాతర. ఇక్కడి ప్రజలు పైడితల్లి అమ్మవారిని తమ ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. ఈ జాతర తోలేళ్ల ఉత్సవంతో ప్రారంభమవుతుంది. కంబాల జాతరతో ముగుస్తుంది. ఈ జాతర ఏర్పాట్లు రెండు నెలల ముందు నుంచే ప్రారంభం అవుతాయి. గజపతుల ఆడపడుచే ఈ పైడితల్లి. ఈ అమ్మవారి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి సిరిమాను ఉత్సవాలు లాంఛనంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
