తెలంగాణలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్ద గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. తొలిరోజు రాత్రి అక్కడి వారంతా తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా తమ సంప్రదాయ ఆయుధాలు తీసుకుని గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ చేశారు. రెండో రోజు యాదవ పూజారులు లింగమంతుల స్వామికి బోనం వండి నైవేద్యం సమర్పించారు. చౌడమ్మ తల్లికి వర్ధ గొర్రె, తల్లి గొర్రె, బద్దేపాల గొర్రె, బోనాలు సమర్పిస్తారు. ఇక ఈ జాతరలో మూడవ రోజే అత్యంత కీలకం.
మూడో రోజైన స్వామి వారి కల్యాణంలో చంద్రపట్నం వేసి లింగమంతుల స్వామి, చౌడమ్మకు బియ్యం పిండి, పసుపుతో ఆలయాల ఎదుట ముగ్గు వేస్తారు. అనంతరం ముగ్గుకు నాలుగు వైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. ఆపై ఆకర్షణీయంగా చంద్రపట్నం వేసి దేవరపెట్టెను ప్రతిష్టింపజేశారు. నాలుగవ రోజున కేసారం నుంచి పాలు తీసుకుని వస్తారు. రెండు కొత్త కుండల్లో బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం మాంసాన్ని వండుకొని తినడం ఆనవాయితీ. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగించడంతో ఆనవాయితి. ఐదు రోజుల పాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో పెద్దగట్టు మార్మోగుతుంది.