
వినాయక చవితి రాబోతోంది. వినాయకుడి వద్ద తప్పనిసరిగా కలశం పెడతారు. కలశం పెట్టడమనేది అందరికీ తెలిసిందే కానీ అసలు దానిని ఎందుకు పెడతారు? కలశం కోసం ఎలాంటి పాత్రలను వాడతారనేది మాత్రం చాలా మందికి తెలియదు. అసలు కలశం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. నీటితో నిండిన ‘ఇత్తడి’ లేక ‘మట్టి’ లేక ‘రాగి’ పాత్రను పాత్ర మొదట్లో మామిడి ఆకులు.. వాటి పైన కొబ్బరికాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర ‘కలశం’ అనబడుతుంది.
ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు ‘పూర్ణకుంభము’ అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.
ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో ‘ కలశం’ ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది (పూర్ణకుంభం) మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
