శ్రావణమాసంలో సంగమేశ్వర స్వామివారి ఆలయంలో ఏం జరుగుతుందంటే..

మెదక్ జిల్లాలో నిజాంసాగర్ వెనుక కొప్పోలులో ఉన్న ఉమాసంగమేశ్వర ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలోని గర్భాలయానికి ముందు ఒక పెద్ద నంది ఉంటుంది. స్వామివారి గర్భాలయం స్వతఃసిద్ధంగా ఏర్పడిన గుహ కావడం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని గుహాలయం అని కూడా పిలుస్తారు. గర్భగుడిలో కొలువు తీరిన శ్రీ ఉమా సంగమేశ్వరస్వామి భక్తులు ఏది కోరినా దానిని తీరుస్తాడట.

ఇక్కడి విశేషం గురించి ముందుగానే తెలుసుకున్నాం కదా. స్వామివారిని అభిషేకించిన జలం బయటకు కనిపించకుండా గర్భాలయంలోని భూమిలో ఇంకిపోతుంది. ఇదెటు వెళుతుందనేది ఎవ్వరికీ తెలియదు. ఇక ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఒక్క శ్రావణ మాసంలో మాత్రం గర్భగుడిలో కింద నుంచి నీరు పైకి వచ్చి గర్భాలయమంతా నిండిపోతుంది. శివలింగం సైతం ఒక్కోసారి ఆ నీటి మునిగిపోతుంది. మళ్లీ తర్వాత ఆ నీరు దానంతటికి అదే తగ్గిపోతుంది. ఇదెలా జరుగుతుందన్నది కూడా ఎవరికీ తెలియదు.

1970 ప్రాంతంలో శ్రీ మదనానంద సరస్వతి ఇక్కడ తపస్సు చేశారని ముందుగానే చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ఆయన ఈ ఆలయంలో అనేక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో ధ్వజస్తంభం పక్కనే వున్న అతి చిన్న నంది, గరుడ, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక ఆలయం వెలుపలికి వెళితే.. కొన్ని ఉపాలయాలు సైతం ఉన్నాయి. ఆ ఉపాలయాల్లో దుర్గా పంచాయతనం, శనేశ్వరుడు, కోటి లింగేశ్వరస్వామి, నటరాజులు కొలువుదీరారు. ఈ విగ్రహాలను సైతం శ్రీ మదనానంద సరస్వతే ప్రతిష్టించారని చెబుతారు.

Share this post with your friends