గంగమ్మ జాతరలో ఏ ఏ రోజున ఏ ఏ వేషాలు ధరిస్తారంటే..

తాతయ్య గుంట గంగమ్మ జాతరలో వివిధ రకాల వేషాలు వేస్తారు. అవేంటో తెలుసుకుందాం. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం – కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మకం. రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందట. మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతారు. స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.

నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యం చెబుతుందట. దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం కూడా వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది.

Share this post with your friends