యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన రాజగోపుర విశేషాలేంటంటే..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బంగారు దివ్య విమాన రాజగోపురం ఆవిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. ఈ దివ్య విమాన గోపుర విశేషాలేంటంటే.. ప్రధానాలయ పంచతల విమాన గోపురం ఎత్తు 47 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురం ఇదే కావడం విశేషం. స్వర్ణ గోపురానికి ఆరడుగుల ఎత్తుతో సుదర్శన చక్రం.. 16 కర్ణకూటములు, 16 ముఖశాలలు, నాలుగు మహా నాసికాలు, 24 కేశమూర్తి, నాలుగు తార్క్ష్య,పక్ష్య,గరుడ, సుపర్ణ మూర్తులు, నాలుగు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ద మూర్తులు, ఐదు నరసింహ మూర్తులు, 8 సింగం మూర్తుల రూపాలు రూపొందించారు. విమానంపై నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి, గరుడ మూర్తి ఆకారాలను డిజైన్ చేశారు.

మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీతో ఈ స్వర్ణ కవచాల రూపకల్పనలకు తెలంగాణ ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. గత ఏడాది దసరా రోజున చేపట్టిన స్వర్ణ తాపడం పనులను స్మార్ట్ క్రియేషన్స్ ప్రారంభించింది. గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర విమాన గోపురం ఉంటుంది. ఈ విమానానికి బంగారంతో తాపడం చేసేందుకు 68 కిలోల బంగారం అవసరపడింది. 50.5 అడుగులతో దేశంలోనే అత్యంత ఎత్తయిన పంచతల గోపురంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురం ప్రసిద్ధిగాంచింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే మొదటిది. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని రూపొందించారు.

Share this post with your friends