
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 25వ తేదీ శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి కల్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీపద్మావతితో నారాయణవనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాల్లో సంచరించాడు. స్వామివారు సంచరించిన ప్రాంతాల్లో అప్పలాయగుంట కూడా ఒకటి. సాక్షాత్తు స్వామి వారు ఇక్కడ కొంతకాలం పాటు నివసించారట. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెతో కలిసి శ్రీనివాసుడు అప్పలాయగుంటలో కొంతకాలం నివాసమున్నాడు. ప్రసన్నంగా స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడి స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు.
