
శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అశేషంగా భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ రంగంలోకి దిగారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. గురువారం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల క్యూ లైన్లు సర్వదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శన, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను వినయ్ చంద్ పరిశీలించారు. భక్తులను ఇబ్బందికి గురి చేస్తే సహించబోమన్నారు.
ఆ తరువాత అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆయా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ ప్రణాళికబద్దంగా ఉండాలని.. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు. అల్పాహారం, బిస్కెట్లు క్రమం తప్పకుండా అందించేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. భక్తులకు అవసరమైన వైద్యం, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ప్రథమ చికిత్స కేంద్రం వద్ద సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని వినయ్ చంద్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అవసరమైన అన్నిచోట్ల కూడా సమాచారబోర్డులు. సూచికబోర్డులు అధిక సంఖ్యలో ఉండాలని అధికారులకు వినయ్ చంద్ సూచించారు.
