కనకదుర్గమ్మ నామస్మరణతో మారుమోగిన విజయవాడ

ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న ఆలయంలోనే కాదు.. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి శీనునాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది.

తప్పెట్లు, కోలాటం, నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం, కళా బృందాల ప్రదర్శనల నడుమ ఈ గిరి ప్రదక్షిణ సందడిగా కొనసాగింది. ఈ గిరి ప్రదక్షిణ శ్రీ కామధేను అమ్మవారి సన్నిది వద్ద ప్రారంభమై.. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. విజయవాడ మొత్తం నేడు కనకదుర్గమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Share this post with your friends