
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో బాలాలయ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగిందని తెలుసుకున్నాం కదా. దీనిలో భాగంగా అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆస్టిన్ నగరంలో నివాసం ఉంటున్న హిందూమతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు టెంపుల్ వాలంటీర్లు అన్నదానం చేశారు. సాయంకాలం ఆటపాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ప్రస్తుతం ఈ బాలాలయంలో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడ కొలువైన స్వామివార్లకు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. బాలాలయ ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఈ ప్రదేశంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా 200కు పైగా పర్యావరణ హిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయకచవితి మాత్రమే కాకుండా.. దసరా సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు వంటివి కూడా నిర్వహించారు. ప్రస్తుతం కార్తీకమాసం కాబట్టి హరిహరక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది.
