అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారి కొలువయ్యాడు. ఈ ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు చెందిన ఆహ్వాన పత్రికలను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. అసలు ఈ ఆలయ స్థలపురాణం ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయం ఈనాటిది కాదు.. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో వేంగి చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.
శ్రీకృష్ణదేవరాయలు కుటుంబీకులైన శ్రీ అచ్చుతదేవరాయలు, శ్రీ కంభం తిమ్మారాజు కూడా స్వామివారికి అనేక సువర్ణాభిరాములు చేసి అనేక మాన్యములు దానమిచ్చినట్టుగా శాసనం ద్వారా తెలుపబడుచున్నది. చోళ మహారాజు ఒకరోజు రాత్రి ఈ ప్రదేశంలో బస చేయగా, ఆ రోజున స్వామివారే స్వప్నంలో సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో తన ఆలయాన్ని నిర్మించమని కోరగా నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా స్వామి వారిని దర్శించి స్వామివారి మీద అనేక సంకీర్తనలు కూడా రచించి ఉన్నారు.