
సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజరాజేశ్వరస్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వేములవాడ రాజన్న కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా లడ్డూలను అందజేస్తారు. వీటిని భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. ఏ ఆలయ ప్రసాదమైనా కాస్త ప్రత్యేకంగా అనిపిస్తే తప్పక తీసుకెళ్లి తమ సన్నిహితులకు, బంధువులకు పంచుతారు కదా.. ఈ క్రమంలోనే వేములవాడ రాజన్న ప్రసాదాన్ని భక్తులు ఇష్టంగా తినడమే కాకుండా ఇంటికి తీసుకెళ్లి సన్నిహితులకు పంచుతుంటారు.
వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డూ తారీ కోసం ప్రత్యేకంగా కొందరు ఉంటారు. ఇక్కడ తయారయ్యే కిలో లడ్డు కోసం 650 గ్రాములు నెయ్యి, రెండు కిలోల పంచదార, 75 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరం, జాజికాయ వాడుతారు. ఈ లడ్డూ తయారీ కోసం పెద్ద ఎత్తున నెయ్యిని వినియోగిస్తారు. ప్రతి నెలా పదిహేను వేల కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు. ఇక్కడి లడ్డూ ప్రసాదం విక్రయంతో ప్రతి ఏటా ఆలయానికి 20 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
