వేద విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, సనాతన హిందూ ధర్మ సంరక్షకులుగా వ్యవహరించి సంస్థ ఖ్యాతిని నలు దిశల వ్యాప్తి చేయాలని ఏపి మాజీ సిఎస్, టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఉద్ఘాటించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శుక్రవారం జరిగిన గణేశ నవాహ్నిక ఉత్సవాల్లో అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో కలిసి ఏపీ మాజీ సిఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, వందలాది మంది విద్యార్థులకు వేద విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం దేశంలోనే పురాతన విద్యాసంస్థల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.
విద్యార్థులు తమ విద్యా సంస్థ గొప్ప చరిత్ర గురించి ముందుగా తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఒకటిన్నర శతాబ్దాలలో ఇది గొప్ప విద్యా కేంద్రంగా, వేదాల రంగంలో ఎందరో ప్రముఖులను తయారు చేసిందన్నారు. కాబట్టి ఈ సంస్థ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతి విద్యార్థి బాధ్యత అని వివరించారు. ముందుగా టీటీడీ అదనపు ఈవో స్వాగతోపన్యాసం చేస్తూ, విద్యార్థులకు వేద విద్యను అందించడమే కాకుండా వారి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. తిరుమలలో విద్యార్థులకు యోగా, ధ్యానంతో పాటు క్రీడా సముదాయమును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వేద విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు, వారి భవిష్యత్ ను నిర్మించుకోవడానికి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులచే ఇకపై తరచు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు . అనంతరం ఆవరణలో జరిగిన శ్రీ వీర గణపతి ఉత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మగిరి ప్రిన్సిపాల్ శ్రీ కేఎస్‌ఎస్ అవధాని, విఎస్‌వో శ్రీ సురేంద్ర, వేద అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.