శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టిన వేద పండితులు

ఇవాళ వినాయక చవితి. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరిగాయి. శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు వేద పండితులు, ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యాగశాల ప్రవేశంతో గణపతి నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రత్నగర్భ గణపతికి, సాక్షిగణపతికి, యాగశాలలోని పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహించనున్నారు. సాక్షిగణపతి వద్ద మృత్తికా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలంలో లోక కల్యాణార్థం గణపతి నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి 16వ తేదీ వరకూ జరుగనున్నాయి. ధర్మ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహిస్తున్న ఈ పూజల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీనికోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునే సౌకర్యాన్ని సైతం అధికారులు కల్పించారు. దీంతో భక్తులు పూజల కోసం పెద్ద ఎత్తున పేర్లు నమోదు చేసుకున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 16వ తేదీతో ముగియనున్నాయి.

Share this post with your friends