10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనంపై ఆగమ శాస్త్రం ప్రకారం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయాలు చేస్తే సహించను, భక్తితో సేవాభావంతో పనిచేయాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. మృతి చెందిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు.
ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
గాయపడిన 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి శుక్రవారం శ్రీవారి దర్శనం, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ శ్రీ రమణ కుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ రెడ్డిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేవారు. ఎంతటి వారైనా వడ్డీకాసుల వాడీ లెక్కల నుండి తప్పించుకోలేరన్నారు. క్రైస్తవులకు జెరూసలేం, ముస్లింలకు మక్కా లాగా, తిరుమల హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమని, జీవితకాలంలో ఒకసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. భక్తుల ఆశయాలకు తగ్గట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు, టిటిడి పాలక మండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో భక్తితో సేవలు అందించాలని చంద్రబాబు సూచించారు.