27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. నల్లమల అంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున నల్లమల అరణ్యం గుండా కాలినడకన మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తున్న వారి కోసం సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది.

ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరిచారు. అలాగే వైద్య సదుపాయాలు సైతం కల్పించారు. కన్నడిగులంతా పాదయాత్ర చేసుకుంటూ అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి నడుచుకుంటూ మల్లన్న ఆలయానికి వస్తున్నారు. వీరికోసం అటవీ మార్గంలో ఎలాంటి రాళ్లు రప్పలు లేకుండా చదును చేసి రహదారి వెంట ట్రాక్టర్లతో నీళ్లు చల్లిస్తున్నారు. కన్నడ వాసులు శ్రీశైలం భ్రమరాంబికా దేవిని తమ ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దట్టమైన అడవిలో మండుటెండను సైతం లెక్క చేయకుండా కాలినడకన 40 కిలో మీటర్ల పాటు నడుకుంటూ శ్రీశైలానికి వస్తున్నారు. వారికి దాతలు మార్గమధ్యంలో మజ్జిగ, పండ్లు, అన్నదానం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు.

Share this post with your friends