
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు ఇతర సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ విషయమై తిరిగి మరో తాత్కాలిక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ నుంచి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో ప్రస్తుతం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీంతో దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. దాదాపు నిత్యం 70 వేల మంది భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుంటున్నారు.
