
తిరుమలలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80 శాతం పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని గోగర్భం డ్యామ్ కు సమీపంలోని ఆక్టోపస్ భవనం వద్ద గురువారం ఉదయం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పగడ్భందీగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.
భక్తులు వాహనాల ద్వారా తీసుకొస్తున్న ప్లాస్టిక్ ను కారు విండోల ద్వారా ఘాట్ రోడ్లలో విసురుతున్నారని, దీని ద్వారా ప్లాస్టిక్ అధికంగా పేరుకుపోతుండటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్లాస్టిక్ ను నియంత్రిస్తున్నామన్నారు. భక్తులకు కూడా వాహనాల్లో నుండి రోడ్డుపై ప్లాస్టిక్ విసరకూడదని అవగాహన కల్పిస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతి చెట్టుకు ప్రాధన్యత ఉందని, విదేశీ మొక్కలు నాటడం ద్వారా స్వదేశీ చెట్లకు హాని కలుగుతుందని చెప్పారు. అందులో భాగంగా పూర్తిస్థాయిలో పరిశోధన చేసి 40 స్థానిక మొక్క జాతులు ను గుర్తించి తిరుమలలో నాటుతున్నామని చెప్పారు. త్వరలో అటవీశాఖ సహకారంతో రెండు లక్షల మొక్కలను నాటుతామని తెలియజేశారు.
