
దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులలో హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోనిసమావేశ మందిరంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సోమవారం ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.
విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను శిక్షణ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన ఆదేశించారు. ముందుగా హెచ్ డి పీపీ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ- ఆప్యాయత- కృతజ్ఞత, కరుణ, సమగ్రతలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టీటీడీ పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
