
ఇటీవల ఎందుకోగానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఇద్దరు వ్యక్తులతో పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించారని ఒకసారి.. టీటీడీ గో సంరక్షణశాల విషయంలో మరోసారి.. స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న పానీయాలు అందజేసే విషయంలో టీటీడీ విఫలమైందని ఇంకోసారి రచ్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మద్యం సేవించి తిరుమలలో తిరిగాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై టీటీడీ స్పందించింది.
సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోంది. సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం. ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
