లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన టీటీడీ

తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్‌ అనే వ్యక్తి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. జూన్ 8న, శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని సదరు వ్యక్తి ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన టీటీడీ, సదరు వ్యక్తిని అంబులెన్సు ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ వైద్య పరీక్షలలో సదరు వ్యక్తి ప్రసాదం తినేటప్పుడు తన నాలుకను తానే కొరుక్కోవడంతో నాలుక కింద భాగంలో కేవలం చిన్నపాటి గాయం అయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ, టీటీడీ వద్ద నష్ట పరిహారం పొందాలనే దురుద్దేశంతో సదరు వ్యక్తి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలను గందరగోళపరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది.

Share this post with your friends