శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ విశేష కృషి చేశారని ఆయన మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త తెలిపారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 133వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య రాళ్లపల్లి దీప్త అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారన్నారు.
రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని తెలియజేశారు. ఈయనకు సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందని, ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని వివరించారు. శ్రీ గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్ మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ రాళ్ళపల్లి ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు పరిష్కరించడంలో శ్రీ రాళ్ళపల్లి వారు విశేష కృషి చేశారన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా అన్నమయ్య కీర్తలలోని ఆనాటి సాహిత్యన్ని పరిష్కరించి అందించినట్లు వివరించారు.
అనంతరం ప్రముఖ శాసన పరిశోధకులు తొండవాడకు చెందిన శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అన్నమయ్య సంగీత సాహిత్యం తెలిసిన వాగ్గేయకారుడన్నారు. ఆయన సంకీర్తనలలో అలంకారాలు, భావాలు, రసాలు కలిసి ఉంటాయన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ మనకు అందించారని వివరించారు.