ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి శ్రీవారి సారెను సమర్పించిన టీటీడీ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం శ్రీ‌వారి సారెను తిరుమ‌ల నుండి తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. శ్రీ‌వారి సారెకు ప్ర‌త్యేక పూజ‌లు చేసి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుప‌తి పుర వీధుల‌లో కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యం, ఆర్‌.టి.సి బ‌స్టాడ్‌, తిరుచానూరు పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు. అటు తర్వాత అమ్మవారికి పద్మ సరోవరం మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, డైమెండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను దాదాపు మూడు కేజీలకు పైగా రూ. 1.11 కోట్లు విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, సివిఏస్వో శ్రీ శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ నన్నపనేని సదాశివరావు, ఎస్. నరేష్ కుమార్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు, శ్రీ‌వారి సేవ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends