
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పటిష్టంగా శ్రీవారి సేవను అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. ఈ క్రమంలోనే వివిధ రంగాల నిపుణుల సేవల గురించి వివరించారు. వివిధ రంగాల నిపుణుల సేవలును వినియోగించుకునేందుకు వీలుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ఐలకు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలు కల్పించడంలో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. వీటితో పాటు గోమాతలకు సేవ చేసేందుకు సైతం ‘గోసేవ’ను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.
అలాగే గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తిరుమలలో తిరునామ ధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించామన్నారు. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందన్నారు.
టీటీడీలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవలే పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈవో తెలిపారు.
