
తిరుమల తిరుపతి దేవస్థానం మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు వెల్లడించారు. తాజాగా తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు. ముందుగా వేసవి నేపథ్యంలో చేసిన ఏర్పాట్లను వివరించారు. వేసవి నేపథ్యంలో తిరుమల, టీటీడీ స్థానికాలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టామన్నారు.
భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంతరాయంగా నీటిని పిచికారి చేస్తున్నట్టు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుమలలోనే కాకుండా తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో దర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు సైతం మంచినీరు, మజ్జిగ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ ఈవో భక్తులకు వెల్లడించారు.
