రేపే ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారాన్ని ఏమని పిలుస్తారంటే..

రేపే వైకుంఠ ఏకాదశి. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి. వైకుంఠ ఏకాదశి నాడు ముఖ్యమైన ఆలయాలన్నింటిలోనూ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులంతా ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎంత కష్టమైనా కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని తపిస్తూ ఉంటారు. మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు.

ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి.. ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చాడు. ఇక కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది.

Share this post with your friends