శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి కార్యక్రమం ఇవా జరుగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు.
మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.