
ఇవాళ (ఆదివారం) క్షమాగుణ దినోత్సవం. ఈ సందర్భంగా క్షమాగుణం చేసే మేలేంటో తెలుసుకుందాం. రాయి విసిరిన వారికీ పండును ఇచ్చే వృక్షం క్షమాపణకు జీవంత ఉదాహరణ. మన్నించే మనసు – సామరస్యానికి పునాది. ద్వేషం లేని సమాజం – క్షమాగుణం ద్వారానే సాధ్యం. ప్రేమ అనేది బంధాలను కాపాడే శక్తి. కానీ వాటిని చిరకాలం నిలబెట్టేది క్షమాగుణమే. స్నేహం, కుటుంబం, దాంపత్యం, బంధుత్వం అన్నీ క్షమాగుణంతోనే సుస్థిరమవుతాయి. ఈ ‘క్షమాగుణ దినోత్సవం’ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క్షమాగుణ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
క్షమాపణ చెప్పినప్పుడు మనసు తేలికవుతుంది. అపరాధ భావం తొలగి, మానసిక స్థిరత్వం కలుగుతుంది. క్షమాపణ మానసిక ఒత్తిడిని తొలగించే దివ్యమూలిక. క్షమాగుణం ఉన్నవారు జీవితంలో శిఖరాలను అధిరోహిస్తారు. శత్రువులు తగ్గిపోతారు, సమాజం వారిని గౌరవిస్తుంది. స్నేహితులు, బంధువులు, తోబుట్టువుల మధ్య తగాదాలు సాధారణం. కానీ క్షమాపణతో విభేదాలు కరిగిపోతాయి. ఒక చిన్న “క్షమించు” అనే మాట ఎన్నో గోడలను కూల్చేస్తుంది. క్షమించమన్నది అన్యాయానికి, దుర్మార్గానికి అనుమతి కాదు. అది మన హృదయాన్ని నిర్మలంగా ఉంచే దివ్య శక్తి.
